TNR: టీఎన్ఆర్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి, సంపూర్ణేశ్ బాబు ఆర్ధిక సహాయం!

ప్రముఖ నటుడు, యాంకర్, జర్నలిస్టు టీఎన్ఆర్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి లక్షరూపాయల ఆర్థిక సహాయం అందించారు. టీఎన్ఆర్ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు చిరంజీవి. మరో నటుడు సంపూర్ణేష్ బాబు యాభైవేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా టీఎన్ఆర్ ను స్మరించుకున్నారు. వ్యక్తిగతంగానూ, కెరీర్ పరంగా ఇంటర్వ్యూల ద్వారా టీఎన్ఆర్ ఒక్కో మెట్టు ఎదిగారని…వారి కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటామని పేర్కొన్నారు సంపూర్ణేష్ బాబు. కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ టీఎన్ఆర్ మరణించిన విషయం తెలిసిందే.
ఫ్రాంక్టీ విత్ టీఎన్ఆర్ అనే కార్యక్రమంతో ఎంతో పాపులార్టీ సంపాదించారు టీఎన్ఆర్. పేరునే తన బ్రాండ్ గా మార్చుకుని తనదైన స్టైల్లో ప్రశ్నలు అడుగుతూ…ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అందుకే టీఎన్ఆర్ తో ఇంటర్వ్యూలంటే ఎంతో మంది ప్రముఖులు కూడా ఆసక్తి చూపించేవారు. ఎవరికి తెలియని విషయాలను కూడా అతిథుల నుంచి రాబట్టే వారు. ఆర్జీవీ, తేజ, తనికెళ్ల భరణి వంటి సినీప్రముఖులతో నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేసిన ఘనత టీఎన్ఆర్ కే దక్కుతుంది. ఇప్పటివరకు తెలుగులో ఎవరూ కూడా అంత సమయం ఇంటర్వ్యూ చేయలేదు. అంతటి క్రేజ్ ను సంపాదించుకున్నారు టీఎన్ఆర్.
తాజాగా టీఎన్ఆర్ పాడిన పాట నెట్టింట వైరల్ అవుతోంది. నా ప్రేమకే సెలవు…నా దారికే సెలవు అంటూ టీఎన్ఆర్ పాడిన పాట ఆయన అభిమానులను కంటతడి పెట్టిస్తోంది.