COVID-19 VACCINE FOR KIDS: 12 నుంచి 15 ఏండ్ల పిల్లలకు కరోనా వ్యాక్సిన్.. ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి అమెరికా అనుమతి

కరోనా అంతానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటి వరకు 18 ఏండ్లు పైబడిన వారికే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. తాజాగా కరోనా వ్యతిరేక యుద్ధంలో మరో ముదండుగు పడింది. 12 నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్సున్న పిల్లలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఫైజర్- ఎన్ బయోటెక్ తయారు చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్‌కు అమెరికాలో అత్యవసర వినియోగానికి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కరోనా మహమ్మారి వ్యతిరేక పోరాటంలో ముఖ్యమైన అడుగు ముందుకు పడిందని ఎఫ్‌డీఏ కమిషన్ చీఫ్ జానెట్ వుడ్‌కాక్ వెల్లడించారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో పిల్లలను కాపాడటంతో పాటు కరోనా అంతానికి మార్గం సుగమం అయ్యిందన్నారు. ప్రస్తుతం రూపొందించిన వ్యాక్సిన్ ను కీలకంగా పరిశీలించినట్లు చెప్పారు. సమగ్రంగా పని చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇంతకు ముందు ఎఫ్‌డీఏ అమెరికాలో 16 సంవత్సరాలు పైబడిన వారికి ఫైజర్ వ్యాక్సిన్ వేసేందుకు అనుమతి ఇచ్చింది.
అమెరికాలో గతేడాది మార్చి నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగింది. గత మార్చి నుంచి ఏప్రిల్ 30 వరకు 11 నుంచి 17 సంవత్సరాల మధ్య వయసున్న 1.5 మిలియన్ల మంది యువతీ యువకులు కరోనా బారినపడ్డారు. తాజాగా ఫైజర్ కంపెనీ 12 నుంచి 15 మధ్య వయస్సున 2 వేల మందికిపైన క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. ఈ ట్రయల్స్ లో వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఇంతకు ముందు కెనడాలో సైతం పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ వేసేందుకు అనుమతి ఇచ్చింది.