ISRAEL-GAZA CONFLICT: మిడిల్ ఈస్ట్ దేశాల మధ్య పెచ్చరిల్లుతున్న హింస.. రాకెట్, వైమానిక దాడులతో దద్దరిల్లుతున్న ఇజ్రాయెల్, పాలస్తీనా.. యూదులు వర్సెస్ అరబ్బుల జగడానికి అసలు కారణమేంటి?

మిడిల్ ఈస్ట్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధం చినికి చినికి గాలి వానగా మారుతోంది. ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య భీకర యుద్ధం.. యూదులు వర్సెస్ అరబ్బుల గొడవగా రూపుదిద్దుకుంది. గత 5 రోజులుగా ఇరు దేశాల మధ్య దాడుల పరంపర కొనసాగుతోంది. ఒక వైపు నుంచి రాకెట్ల ద్వారా దాడులు జరుగుతుంటే.. మరోవైపు వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఈ యుద్ధం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తంది. ఇంతకీ ఈలొల్లికి అసలు కారణమేంటి? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
గత నెల రోజులుగా జెరుసలేంలో హింస చెలరేగుతుంది. ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాలు రెండూ ఈ సిటీని తమ రాజధానికిగా భావిస్తాయి. ముస్లింల అతిపెద్ద పండుగ రంజాన్ మాసం ఏప్రిల్ 12న మొదలైంది. ఈ సందర్భంగా అల్ అక్సా మసీదు సమీపంలో ఇజ్రాయెల్ ఆంక్షలు విధించింది. కేవలం 10 వేల మందికి మాత్రమే నమాజ్ చేసుకునేందుకు పర్మీషన్ ఇచ్చింది. ఇస్లాం ప్రకారం అల్ అక్సా మసీదు ప్రపంచంలోనే మూడవ పవిత్ర ప్రదేశం. ఈ ప్రాంతంలోనే యూదులకు సంబంధించిన ఫస్ట్, సెకండ్ టెంపుల్స్ ఉన్నాయి. ఈ ప్రాంతానికి టెంపుల్ మౌంట్ అనే పేరుంది. ఈ నేపత్యంలో రంజాన్ ప్రార్థనలకు వేలాది మంది ముస్లింలు తరలి వచ్చారు. దీంతో ఇజ్రాయెల్ సైన్యం ముస్లింలను అల్ అక్సా మసీదు నుంచి వెళ్లగొట్టారు. ఇప్పటి హింసకు ఇదే మూలకారణంగా చెప్పుకోవచ్చు.
దీంతో పాటు షేక్ జారాలలో సైతం అల్లర్లు జరిగాయి. పాలస్తీనా కుటుంబాలను అక్కడి నుంచి తరలించేందు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఆందోళనలు చెలరేగాయి యూద సెట్లర్ గ్రూపు.. కొంత భూభాగం కోసం పాలస్తీనా వాసులతో గొడవపడ్డారు. కోర్టు మెట్లు కూడా ఎక్కారు. దీంతో ఆ సమస్య మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ కేసులో ఇజ్రాయిల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఈయూ , యూఎన్, బ్రిటన్ దేశాలు తీవ్రంగా తప్పుబట్టాయి.
అటు అల్ అక్సా మసీదు సైతం వివాదాలకు కేరాఫ్ గా ఉంది. మసీదు కాంపౌండ్ వాల్ దగ్గర వెస్ట్రన్ వాట్ ఉన్నది. ఈ ప్రాంతలో యూదులు ప్రార్థనలు చేస్తారు. ఇదే ప్రాంతంలో పవిత్ర టెంపుల్స్ ఉండేవని వారి నమ్మకం. వివాదం నేపథ్యంలో భారీ సంఖ్యలో జనాలను అనుమతివ్వం లేదు. అల్ అక్సా మసీదు దగ్గర ముస్లింలను అడ్డుకున్నారు. మే 10న జనాలను చెదరగొట్టేందుకు ఇజ్రాయెల్ బలగాలు టియర్ గ్యాస్, గ్రేనేడ్లను ఉపయోగించారు. ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య మళ్లీ చిచ్చు రాజుకుంది. ఈ ఘటనకు ప్రతీకారంగా హమాస్ .. గాజా నుంచి ఇజ్రాయెల్ పై రాకెట్లతో దాడులకు దిగింది. ఇప్పటి వరకు దాడులను కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడుల నేపథ్యంలో అరబ్బులు, యూదులు నివసించే సిటీల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. లాడ్ లో ఇరు వర్గాలు మధ్య భీకర ఘర్షణలు కొనసాగుతున్నాయి. దీంతో లాడ్ లో నెతాన్యహూ ఎమర్జెన్సీ విధించారు. లాడ్ నగరంలో ఉన్న యూద మందిరాలకు అరబ్ ముస్లింలు నిప్పుపెట్టారు. అరబ్ వాహనాలపై యూదులు దాడులకు పాల్పడ్డారు. ఇరు వర్గాల ఘర్షణలతో ఇజ్రాయెల్లో రక్తం ఏరులై పారింది.
ఇజ్రాయెల్ దేశంలో సుమారు 18 లక్షల మంది అరబ్బు ఉన్నారు. వారంతా అరబ్ లేదంటే పాలస్తీనాకు చెందిన వారు. వారికి ఇజ్రాయెల్ సిటిజన్ షిప్ కూడా ఉంది. ఇజ్రాయెల్ దేశంలోని పలు సిటీల్లో యూదులు, అరబ్బులు ఉన్నారు. పలుమార్లు పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్ అరబ్బులు నిరసనలకు దిగడంతో తరుచూ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఇవే పెద్ద పెద్ద యుద్ధాలకు చిచ్చు రేపుతున్నాయి. తాజా ఘర్షణలు సైతం ఈ కొవకు చెందినవే.