జీవనోపాధి సంక్షోభం దిశగా భారత్.. ప్రముఖ ఆర్థికవేత్త జీన్ డ్రెజ్ హెచ్చరిక.. నిర్లక్ష్యం నీడలో వైద్య, ప్రజా ఆరోగ్య రంగం

దేశంలో కరోనా ప్రభావం తీవ్రంగా కొనసాగుతున్న వేళ.. ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. మున్ముందు తీవ్ర ఇబ్బందులు తప్పవనే హెచ్చరికలు వస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై ప్రముఖ ఆర్థికవేత్త జీన్ డ్రెజ్ స్పందించారు. కరోనా కారణంగా భారత్ తీవ్రమైన జీవనోపాధి సంక్షోభం ఎదుర్కొనబోతోందని తీవ్ర హెచ్చరిక చేశారు. కరోనా సెకెండ్ వేవ్ మూలంగా శ్రామిక వర్గాలు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో 2024-25 నాటికి కేంద్రం అనుకుంటున్నట్లు భారత ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరడం సాధ్యం కాదన్నారు. ఏ విధంగా చూసినా ఇదో పనికిరాని లక్ష్యంగా ఆయన అభిప్రాయపడ్డారు.
బెల్జియం సంతతికి చెందిన భారత ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్త జీన్ డ్రెజ్ యూపీఏ ప్రభుత్వ హయాంలో జాతీయ సలహా మండలి సభ్యుడిగా పనిచేశారు. తాజాగా ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక అంశాలన ఆయన ప్రస్తావించారు. దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో పోలిస్తే, స్థానిక లాక్‌డౌన్‌లతో ఆర్థిక నష్టం తక్కువే అన్నారు. కార్మిక వర్గానికి గత ఏడాది కంటే తీవ్ర పరిస్థితులు ఎదురవుతున్నట్లు చెప్పారు. ప్రస్తుత సంక్షోభం ఏళ్ల తరబడి కొనసాగే అవకాశం ఉందన్నారు. గత ఏడాది ప్రకటించిన ప్రజా ఉపయోగకర చర్యలు మళ్లీ చేపట్టాలని సూచించారు. మే, జూన్ ఇస్తామని చెప్పిన ఉచిత రేషన్ మరిన్ని నెలలకు విస్తరించాలన్నారు.
వైద్య, ప్రజా ఆరోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చిన భారత్ ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతుందని జీన్ డ్రెజ్ చెప్పారు. నాణ్యమైన జీవనానికి ఆరోగ్యం చాలా ముఖ్యమన్నారు. కానీ భారత ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం ఏటా ఖర్చు చేసున్న మొత్తం జీడీపీలో ఒక శాతం కూడా లేదని విమర్శించారు.