GATES DIVORCE: గేట్స్ దంపతుల ఆస్తుల పంపకం.. మెలిండాకు 15 వేల కోట్ల విలువైన షేర్లు అప్పగింత.. అత్యంత ఖరీదైన విడాకుల్లో ప్లేస్

27 ఏండ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు చెప్పిన గేట్స్ దంపతులు.. తాజాగా ఆస్తుల పంపకం కసరత్తు మొదలు పెట్టారు. ఇప్పటికే మెలిండా ఫ్రెంచ్ గేట్స్ పేరు మీద 200 కోట్ల డాలర్లు భారత కరెన్సీలో సుమారు రూ.14,772 కోట్ల విలువైన షేర్లు ఆమె పేరు మీదికి ట్రాన్స్ ఫర్ అయ్యాయి. బిల్ గేట్స్ సృష్టించిన హోల్డింగ్ కంపెనీ కాస్కేడ్ ఇన్వెస్ట్ మెంట్.. మెక్సికోలోని రెండు అతి పెద్ద కంపెనీలను మెలిండాకు అప్పగించింది. గత కొన్ని రోజులుగా మెలిండా అందుకున్న మొత్తం షేర్ల విలువ 200 కోట్ల డాలర్లకు చేరింది. తాజాగా కాస్కేడ్ కంపెనీ 50 కోట్ల డాలర్ల విలువైన కోకా-కోలా ఫెంసా, గ్రూపో టెలివిజా కంపెనీల షేర్లు సైతం మెలిండాకు వచ్చాయి.
ఇద్దరు పరస్పర సమ్మతితోనే విడిపోతున్నట్లు గేట్స్ దంపతులు ఈ నెల 3న ప్రకటించారు. అదే రోజు ఈ షేర్లు మెలిండా పేరిట ట్రాన్స్ ఫర్ అయినట్లు తెలుస్తోంది. కాస్కేడ్ ఇప్పటికే 180 కోట్ల డాలర్ల విలువైన కెనడియన్ నేషనల్ రైల్వే కంపెనీ, ఆటోనేషన్ ఐఎన్‌సీల షేర్లను మెలిందాకు అప్పగించింది. చరిత్రలో అత్యంత ఖరీదైన విడాకుల్లో గేట్స్ దంపతులది కూడా ఒకటి కావడం విశేషం. మైక్రోసాఫ్ట్ అధినేత అయిన బిల్‌గేట్స్ ప్రస్తుత సంపద విలువ 14 వేల 420 కోట్ల డాలర్లు. భారత కరెన్సీలో సుమారు రూ.10.6 లక్షల కోట్లు. గేట్స్ కు సంబంధించి ఈ కాస్కేడ్ ఇన్వెస్ట్ మెంటే అత్యంత పెద్ద ఆస్తి కావడం విశేషం.