కరోనా టీకా వేసుకుంటే బీరు, డోనట్స్ ఫ్రీ.. అమెరికా యువతకు బంఫర్ ఆఫర్.. వ్యాక్సినేషన్ సక్సెస్ కోసం బైడెన్ సర్కార్ నిర్ణయం

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ వ్యాపిస్తున్నా.. వ్యాక్సిన్ వేసుకునేందుకు యువత అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. వారిని బలవంతం పెట్టి వ్యాక్సీన్ ఇవ్వకుండా.. తమంతటా తామే వచ్చి తీసుకునేలా సూపర్ ఐడియా కనిపెట్టింది. వ్యాక్సిన్ వేసుకున్న వారికి బీరు ఫ్రీగా ఇవ్వాలని భావిస్తోంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అమెరికా అధినేత జో బైడెన్ దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందజేసేలా చర్యలు తీసుకుంటున్నారు. జూలై 4 వరకు 70 శాతం మంది యువతకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. 18 కోట్ల మందికి కనీసం ఒక డోసు ఇచ్చేందుకు ప్రణాళికలు సిధ్దం చేస్తున్నారు. 16 కోట్ల మందికి రెండు డోసులు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకునేందుకు యువత పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన బైడెన్.. వారిని ఎలా తీసుకురావాలి అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
టీకా తీసుకున్న యువతకు బీర్ బాటిల్ తో పాటు డోనట్స్ అందజేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే న్యూజెర్సీ గవర్నర్ షాట్ అండ్ ఏ బీర్ ప్రోగ్రామ్‌ను మొదలుపెట్టారు. మేలో వ్యాక్సిన్ ఫస్ట్ డోసు తీసుకున్న యువత తమ వ్యాక్సినేషన్ కార్డు ద్వారా ఫ్రీగా బీర్‌ను పొందొచ్చని తెలిపారు. 21 ఏళ్లు పైడిన యువత మద్యం సేవించడాన్ని న్యూజెర్సీ చట్టం చేసింది. దీంతో 21 ఏళ్లు పైడిన యువత షాట్ అండ్ ఏ బీర్ ప్రోగ్రామ్ ను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
అటు వెస్ట్ వర్జీనియా రాష్ట్రం సేవింగ్స్ బాండ్స్ ద్వారా యువత టీకా వేసుకునేలా చేస్తుంది. 16 నుంచి 35 ఏళ్ల వయసున్న వారు టీకా తీసుకున్నాక.. 100 డాలర్ల సేవింగ్ బాండ్‌ను అందజేయనున్నట్టు ఆ రాష్ట్ర గవర్నర్ ప్రకటించారు. మేరీలాండ్ గవర్నర్ కూడా ఇలాంటి ఆఫర్ ఇచ్చాడు. మరికొన్ని రెస్టారెంట్లు కూడా టీకా తీసుకున్నవారికి పలు ఆఫర్లు ఇస్తున్నాయి.