మాట్లాడుకుందామని తీసుకెళ్లి యువకుడి గొంతుకోశారు.. అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను కడతేర్చాడు!

కర్నాటకలో ఒకే రోజు రెండు దారుణ ఘటనలు జరిగాయి. మాట్లాడుకుందా రా.. అని తీసుకెళ్లే స్నేహితులే ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. అటు అనుమానంతో కట్టుకున్న భార్యనే కడతేర్చాడో కసాయి భర్త. ఈ రెండు ఘోరాలు బల్లారిలోనే జరిగాయి.
బళ్లారి బ్రూస్‌పేట పీఎస్ పరిధిలోని మిల్లర్‌పేట సమీపంలో ఇస్మాయిల్ అనే 19 ఏండ్ల యువకుడు నివసిస్తున్నాడు. స్థానికంగా ఉన్న జీన్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తాజాగా రాత్రి సమయంలో నలుగురు యువకులు ఇస్మాయిల్ ఇంటికి వచ్చారు. చిన్న ముచ్చటుంది మాట్లాడుకుని వస్తామని తీసుకెళ్తారు. వచ్చింది తన ఫ్రెండ్స్ కావడంతో కుటుంబ సభ్యులు కూడా అంతకా పట్టించుకోలేదు. ఇస్మాయిల్‌ను తీసుకెళ్లిన యువకులు కణేకల్లు బస్టాండ్ దగ్గరికి వెళ్లారు. అక్కడే ఇస్మాయిల్‌తో గొడవ పడ్డారు. కోపంతో కత్తితో గొంతుకోసి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన ఇస్మాయిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని గుండెలు బాదుకుంటూ విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ నిందితుడిని అరెస్టు చేశారు.
అనుమానంతో భార్యను చంపిన భర్త:
అనుమానం రోగంతో కట్టుకున్న భార్యనే చంపాడో భర్త. ఈ ఘటన కూడా బళ్లారిలోనే జరిగింది. తాళూరు రోడ్డులో మస్తాన్ రెడ్డి, ధనలక్ష్మి అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. భార్యపై భర్త కొంతకాలంగా అనుమానం పెంచుకున్నాడు. తనకు ఒంట్లో బాగాలేదని.. కరోనా పరీక్షలు చేసుకుందామని బయటకు తీసుకెళ్లాడు. కువెంపునగర్ శివారుకు తీసుకెళ్లి తలపై బండతో మోది చంపాడు. ఆ తర్వాత కౌల్‌బజార్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సరెండర్ అయ్యాడు. భార్యను చంపినట్లు పోలీసులకు చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని రిమాండ్ కు పంపించారు.