YSRCP MP ARRESTED: బర్త్ డే రోజునే వైసీపీ ఎంపీ అరెస్టు.. రఘురామకృష్ణ రాజును అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ అధికారులు.. హైదరాబాద్ లో మరోకేసు నమోదు

ఏపీలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు అరెస్టు సంచలనం కలిగిస్తోంది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజును ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని రఘురామ ఇంటికి వెళ్లిన సీఐడీ అధికారులు అతడిని అరెస్టు చేశారు. 124 ఐపీసీ-ఏ సెక్షన్ కింద రఘురామరాజుపై నాన్ బెయిలబుల్ కేసు ఫైల్ చేశారు. ప్రభుత్వ, ముఖ్యమంత్రి ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేశారు. తొలుత సీఐడీ అధికారులను సీఆర్పీఎఫ్ పోలీసులు అడ్డుకున్నారు. తమ ఉన్నతాధికారుల అనుమతి ఉంటేనే అదుపులోకి తీసుకునేందుకు ఒప్పుకుంటామని తేల్చి చెప్పారు. అయినా బలవంతంగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. రఘురామరాజు బర్త్ డే రోజే సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.
గత కొంతకాలంగా ఏపీ సర్కార్‌పై, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై రఘురామరాజు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్, సజ్జల, వైవీ సుబ్బారెడ్డి సహా పలువురిపై ఆయన వరుసగా ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ తప్పులను ఎండగడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు వెళ్లి అరెస్టు చేయడం రాజకీయ దుమారాన్ని రేపుతుంది.
ఎంపీ రఘురామకృష్ణమ రాజును అరెస్ట్ చేయటంలో ఎలాంటి తప్పులేదని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. అతడిని ఎప్పుడో అరెస్ట్ చేయాల్సి ఉండాలన్నారు. ప్రభుత్వం, సీఎంను ఇష్టమొచ్చినట్టు విమర్శిస్తే సహించేది లేదన్నారు. రఘురామలాంటి వ్యక్తి గురించి మాట్లాడాలంటేనే అసహ్యం వేస్తోందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గానికి వెళ్లి ప్రజల ఇబ్బందులను తీర్చాల్సిన వ్యక్తి.. ఎక్కడో ఉండి తన ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శించడం మంచిది కాదన్నారు.
అటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజుపై హైదరాబాద్‌లో మరో కేసు నమోదైంది. ఆయనపై ఓసీ సంక్షేమ సంఘం మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కులం పేరుతో రెడ్లను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని.. కులాలు, వర్గాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యవమరించారని కంప్లైంట్ లో రాసింది. ఆయనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆ సంఘం కోరింది. దీంతో పోలీసులు కేసు నమోదులు చేశారు.