పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి..అసలు సంగతి తెలిస్తే షాక్ అవుతారు…

పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దిశగా పరుగులు పెడుతున్నాయి. దీంతో సామాన్యులకు తమ వెహికిల్స్ బయటకు తీయాలంటే చుక్కలు కనపడుతున్నాయి. గతంలో డీజిల్ ధర పెట్రోల్ ధర కన్నా తక్కువగా ఉండేది. దీంతో పెట్రోల్ కారు కన్నా డీజిల్ కారు కొనేందుకు ఆసక్తి చూపేవారు. అయితే ఇప్పుడు పెట్రోల్, డీజెల్ ధరలు ఒకే రేటు అయిపోవడంతో డీజిల్ కారు డ్రైవర్లు కూడా బేర్ మంటున్నారు. నిజానికి చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెట్రోల్, డీజిల్ ధరలు ఇంతలా పెరగడానికి అసలు కారణం ఏంటి..? ఈ ధరలకు ఎక్కడైనా అడ్డు అదుపు ఉందా.. అనే ప్రశ్నలు సామాన్యులను పట్టి పీడిస్తున్నాయి. నిజానికి అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. అయితే గతంలో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పతనం అయ్యాయి. అయితే కరోనా సమయంలో క్రూడ్ ఆయిల్ ధరలు దాదాపు ఉచితంగా ఇచ్చేస్థాయికి పడిపోయాయి. ఆ సమయంలో కూడా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదు.నిజానికి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2014 జూన్ నుంచి 2016 జూన్ వరకు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు ఏకంగా 50 శాతంపైగా పడిపోయాయి.
కానీ పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం మనకు తగ్గకపోవడం గమనార్హం. పైపెచ్చు…ఈ మధ్య కాలంలో ఏకంగా 47శాతం ధరలు పెరిగాయి. అయితే ఈ పరిస్థితి వెనుక ప్రభుత్వాల పన్నుల బాదుడే ప్రధాన కారణంగా ఉంది. ముఖ్యంగా కేంద్రం వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్రాలు వసూలు చేసే వ్యాట్‌లతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఒక లీటర్ పెట్రోల్‌లో 48.2శాతం ఈ పన్నుల వాటా ఉంది. ఒక లీటర్ డీజిల్ ధరలో 38.9 శాతం పన్ను కడుతున్నాం. అయితే ఇది జనాలను నిలువునా దోచుకోవడమే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే డీజిల్ ధరలు పెంచితే దానికి అనుబంధంగా ఉన్న రవాణా రంగం ప్రభావితమై దాని ప్రభావం నిత్యవసరాలపై పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉంటే 2014 నుంచి జనవరి 2016 మధ్య కాలంలో 9సార్లు ఎక్సైజ్ డ్యూటీని పెంచారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఆదాయానికి గండిపడినప్పుడల్లా ఆ లోటును పూడ్చుకునేందుకు పెట్రోల్ డీజెల్ పై పన్నురూపంలో వసూలు చేశారు. అయితే క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నా ఎక్సైజ్ డ్యూటీని మాత్రం తగ్గించడం లేదు. 15 నెలల కాలంలో మొత్తంగా లీటర్ పెట్రోల్‌పై 11 రూపాయల 77 పైసలు, లీటర్ డీజిల్‌పై 13 రూపాయల 47పైసల మేర ఎక్సైజ్ డ్యూటీ పెంచడంతో సామాన్యుల జేబుకు చిల్లు పడింది. నిజానికి నిత్యవసరాలపై ఈ ఎఫెక్ట్ నేరుగా పడే అవకాశం ఉంది. దీంతో పాటు రవాణా చార్జీలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా ఆర్టీసీ, రైల్వే చార్జీలు కూడా పెరిగే చాన్స్ ఉంది.