INDIAN PHARMA: ఫార్మా ఎగుమతుల్లో భారత్ సరికొత్త రికార్డు.. 18 శాతం వృద్ధి నమోదు.. గత 8 ఏండ్లల్లో ఇదే అధికం

గతేడాది భారత్ లోకి కరోనా ప్రవేశించిన తొలిరోజుల్లో.. మాస్కులు, శానిటైజర్లు దొరకని పరిస్థితి నెలకొంది. పీపీఈ కిట్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. నాలుగు పాళ్లు అవసరం ఉంటే.. కనీసం ఒకపాళు కూడా దొరకని దుస్థితి నెలకొంది. కానీ.. ఆ తర్వాత పరిస్థితులు మారుతూ వచ్చాయి. ప్రస్తుతం ఫార్మా ఎగుమతుల్లో భారత్ రికార్డు నెలకొల్పింది. గతంతో పోల్చితే ఈ సారి భారత్ నుంచి భారీగా వైద్య సంబంధ ఉత్పత్తులు పెరిగాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా ఫార్మా ఎగుమతుల విషయంలో తగ్గుదల నమోదు అయ్యింది. ఆయా దేశాలు ఎగుమతుల కంటే తమ దేశ అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయి. కానీ భారత్ లో ఫార్మా సంస్థలు.. దేశ అవసరాలకు సరిపడ ఉత్పత్తులు అందిస్తూనే.. విదేశాలకు ఎగుమతులు చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఫార్మా ఎగుమతులు 18 శాతం వృద్ధిని సాధించాయి. మొత్తం 24.44 బిలియన్ డాలర్ల ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి చేశాయి. గత 8 ఏండ్లల్లో ఇదే అధికం కావడం విశేషం. వ్యాక్సిన్ ఎగుమతుల్లోనూ 8 శాతం వృద్ధి నమోదైంది. 2020-21కి గాను 883 మిలియన్ డాలర్ల విలువైన వ్యాక్సిన్లు ఎక్స్ పోర్టు అయ్యాయి. ఇందులో కేవలం కరోనా వాక్సిన్ వాటానే 143 మిలియన్ డాలర్లుగా ఉంది.
అటు భారత్ నుంచి అత్యధికంగా ఫార్మా, వ్యాక్సిన్‌లను నార్త్ అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. మన ఔధాల్లో 34 శాతం ఇక్కడికే వెళుతున్నాయి. ఆఫ్రికాదేశాలకు సైతం అధిక ఎగుమతులు కొనసాగాయి. గత ఏడాదితో పోల్చితే 13.40 శాతం మందులు ఎగుమతి అయ్యాయి. ఆ తర్వాత నైజీరియా, కెన్యా, టాంజానియా దేశాలకు ఎక్కువ ఫర్మా ఎగుమతులు కొనసాగాయి. యూరప్ దేశాలకు 11 శాతం ఎగుమతులు జరిగాయి. ఈ ఏడాది ఎగుమతులు ఇంకా పెరుగుతాయని ఫార్మాసూటికల్స్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. అంతేకాదు.. ఇండియాలో తయారు చేసిన జనరిక్ మందులు, వాక్సిన్ల తయారీ మరింత పెరుగుదల సాధిస్తుందని తెలిపింది. కరోనా టీకాలు భారత్‌లోనే తయారవుతుండటంతో ఎగుమతుల్లో దూకుడు పెరుగుతుందని వెల్లడించింది.