CORONA EFFECT: ప్రస్తుత ఉద్యోగం పోయినా భవిష్యత్ లో మంచి ఆఫర్లు వస్తాయి.. భారతీయ ఉద్యోగుల్లో ఆందోళనతో కూడిన ఆశాభావం!

కరోనా ప్రభావంతో అన్ని రంగాలు తీవ్ర కుదేలుకు గురవుతున్నాయి. కోవిడ్ కారణంగా ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. ఆర్ధిక సమస్యలతో పాటు ఉద్యోగ భద్రతపై సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే ప్రస్తుత ఉద్యోగం పోయినా.. భవిష్యత్ లో మంచి ఉద్యోగం వస్తుందనే పాజిటివ్ ఆలోచన భారతీయుల్లో ఉన్నట్లు తాజా సర్వేలో వెల్లడి అయ్యింది.
గత నవంబర్ 17 నుంచి డిసెంబర్ 11 వరకు 17 దేశాల్లో మొత్తం 32 వేల మందిపై ఏడీపీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్.. పీపుల్ ఎట్ వర్క్ 2021 అనే సర్వే నిర్వహించింది. కరోనా సమయంలో తమ ఆర్ధిక, ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్నట్లు 95 శాతం భారతీయులు తెలిపారు. అయితే వచ్చే 5 ఏండ్లలో మంచి అవకాశాలు దక్కించుకుంటామనే ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా తమ ప్రొఫెషన్ మీద చాలా ప్రభావం పడుతుందని 86 శాతం మంది పేర్కొన్నారు. జాబ్ పోవచ్చు లేదంటే లే ఆప్ రావచ్చని సగం మంది చెప్పారు. సాలరీలో కోత పడే అవకాశం ఉన్నట్లు 30శాతం మంది చెప్పగా.. వర్క్ అవర్స్ తగ్గే అవకాశం ఉందని 25 శాతం మంది తెలిపారు. ఒకవేళ ఉద్యోగం పోయినా.. ఇంకో మంచి ఉద్యోగం, అంతకు మించి సాలరీ వస్తుందని చాలా మంది తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.