Hyundai Kia Auto Sales: 2023పై హ్యుందాయ్, కియా ఫుల్ ఫోకస్, విక్రయాలు 10% పెరగవచ్చని అంచనా

ప్రపంచ దిగ్గజ ఆటో మోబైల్ కంపెనీలు 2023పై ఫుల్ కాన్సట్రేషన్ పెట్టాయి. వాహన విక్రయాల్లో దూకుడు పెంచేలా ప్రయత్నాలు మొదలు పెట్టాయి. సప్లయ్ చైన్ అంతరాయం కారణంగా వాహనాలకు పెరిగిన డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే, అమ్మకాలు దూకుడుగా ఉండబోతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
హ్యుందాయ్ మోటార్ కంపెనీ(Hyundai Motor Company)తో పాటు దాని అనుబంధ సంస్థ కియా(Kia Motors Corporation) 2023లో తమ వాహనాల అమ్మకాలు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నాయి. 2022తో పోల్చితే, ప్రపంచ వ్యాప్తంగా తమ వాహనాల అమ్మకాలు(Auto Sales) దాదాపు 10 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నాయి. సప్లయ్ చైన్ అంతరాయం కారణంగా గతేడాది కాస్త అమ్మకాలు నెమ్మదించినట్లు కంపెనీ భావిస్తోంది. ఈ సంవత్సరం అనుకున్న లక్ష్యాల కంటే ఎక్కువగా అమ్మకాలు కొనసాగే అవకాశం ఉందని ఆశిస్తోంది.
2022లో 6.85 మిలియన్ వాహనాల అమ్మకం
హ్యుందాయ్, కియా ఆటో మోబైల్ కంపెనీలు 2022లో 6.85 మిలియన్ వాహనాలను విక్రయించాయి. చిప్, కాంపోనెంట్ కొరత వంటి సమస్యల కారణంగా వారి ఉమ్మడి లక్ష్యం 7.16 మిలియన్ వాహనాల కంటే దాదాపు 4 శాతం తక్కువగా నమోదయ్యింది. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 7.52 మిలియన్ వాహనాల విక్రయాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీలు వెల్లడించాయి. “మార్కెట్ మార్పులకు అనువైన రీతిలో ప్రతిస్పందించాలని భావిస్తున్నాం. ఎలక్ట్రిక్ వాహన రంగంలో వేగంగా ముందుకు సాగేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రపంచ పర్యావరణ నిబంధనలకు లోబడి, ప్రాంతాల వారీగా ఉత్పత్తి, లాజిస్టిక్స్, అమ్మకాలను ఆప్టిమైజ్ చేయడం ద్వారా మార్కెట్ వాటాను విస్తరించడంతో పాటు లాభదాయక వ్యాపారాలను కొనసాగించాలని హ్యుందాయ్ యోచిస్తోంది” అని కంపెనీ తాజాగా వెల్లడించింది.
ఈజీగా లక్ష్యాలను సాధిస్తాయంటున్న విశ్లేషకులు
ఈ ఏడాది రెండు కంపెనీల విక్రయ లక్ష్యాలు భారీగానే ఉన్నప్పటికీ, వాహనాలకు పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుంటే ఈ లక్ష్యాలను సాధించడం పెద్ద కష్టమేమీ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. “హ్యుందాయ్ మోటార్స్, కియా ఇప్పటికీ వాహనాలకు సంబంధించి బ్యాక్ ఆర్డర్‌లు ఉన్నాయి. ఇటీవలి ఆర్థిక మందగమన వాతావరణం ఉన్నప్పటికీ, కార్ల కోసం కొనుగోలుదారులు వేచి చూస్తున్నారు. ఈ డిమాండ్ కారణంగా వారి లక్ష్యాలు నెరవేరే అవకాశం ఉంది” అని గ్వి-యెన్, డైషిన్ సెక్యూరిటీస్ విశ్లేషకుడు కిమ్ వెల్లడించారు. అయితే, అధిక వడ్డీ రేట్లు వంటి ఆర్థిక అడ్డంకులు కార్ల అమ్మకాలను తగ్గించే అవకాశం ఉంటుదని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఈ ఏడాది సెకెండ్ ఆఫ్ లో కార్లకు డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుందన్నారు.
హ్యుందాయ్ 2023 లక్ష్యం 4.32 మిలియన్లు
హ్యుందాయ్ తన జెనెసిస్ బ్రాండ్‌తో సహా 2022 గ్లోబల్ అమ్మకాలు సంవత్సరానికి 1.4 శాతం పెరిగి 3.94 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి. అయోనిక్ 5 అమ్మకాలు భారీగా ఉన్నాయి. ఈ కారణంగానే ఐయోనిక్ 6 అమ్మకాలు సైతం మరింత పెరిగాయి. రెండు ఆల్-ఎలక్ట్రిక్ మోడల్‌లు కలిపి ప్రపంచ వ్యాప్తంగా 100,000 యూనిట్లకు పైగా ఉన్నాయి. గత ఏడాది గ్లోబల్ వాల్యూమ్ 4.9 శాతం పెరిగి 2.9 మిలియన్ యూనిట్లకు చేరుకుందని హ్యుందాయ్ కంపెనీ వెల్లడించింది. 2023లో దీని లక్ష్యం 3.2 మిలియన్లుగా ఉందని కియా తెలిపింది. స్పోర్టేజ్ SUV 2022 గ్లోబల్ సేల్స్ ర్యాంకింగ్‌లో 452,068 యూనిట్ల అమ్మకాలతో అగ్రస్థానంలో ఉంది. సెల్టోస్ SUV 310,418 యూనిట్లతో, సోరెంటో SUV 222,570 యూనిట్లతో రెండో స్థానంలో నిలిచాయి.