GOLD DEMAND: ప్రపంచ వ్యాప్తంగా తగ్గినా.. భారత్ లో భారీగా పెరిగిన బంగారం డిమాండ్.. జనవరి-మార్చిలో 140 టన్నులకు దిగుమతి

ఓవైపు కరోనాతో దేశం అల్లాడుతున్నా.. మరోవైపు బంగారం కొనుగోళ్లు మాత్రం భారీగా పెరిగాయి. గతంతో పోల్చితే 3 నెలల్లో 37 శాతం బంగారం డిమాండ్ పెరిగింది. జనవరి నుంచి మార్చి వరకు 140 టన్నులు దిగుమతి అయ్యింది. గతేడాది జనవరి-మార్చిలో కేవలం 102 టన్నులే బంగారం అమ్ముడు పోయింది. గత మూడు నెలల్లో కరోనా సంబంధిత ఆంక్షలు తగ్గడం, ధరలు దిగిరావడంతో పసిడి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. స్వయంగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా నివేదికలో ఈ విషయాన్నివెల్లడించింది. బంగారం ధర గత ఏడాదితో పోల్చితే 57 శాతం పెరిగింది. రూ.37,580 కోట్ల నుంచి 58,800 కోట్లకు పెరిగింది. ఆభరణాల డిమాండ్ 39 శాతం పెరిగింది. 73.9 టన్నుల నుంచి 102.5 టన్నులకు చేరింది. విలువలో 58 శాతం పెరిగింది. రూ.27,230 కోట్ల నుంచి 43,100 కోట్లకు వెళ్లింది.
భారత్‌లో బంగారం అమ్మకాలు పెరిగినా.. ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ 23 శాతం తగ్గింది. జనవరి నుంచి మార్చిలో 815.7 టన్నులకే పరిమితమైంది. గతేడాది ఇదే వ్యవధిలో 1,059.9 టన్నుల డిమాండ్ ఉంది. పెట్టుబడులు కూడా 71 శాతం తగ్గాయి. గోల్డ్ బార్స్, కాయిన్స్ పై పెట్టుబడులు మాత్రం 36 శాతం పెరిగినట్లు డబ్ల్యూజీసీ వెల్లడించింది. దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.47వేలకు తగ్గింది. ఆర్థిక వ్యవస్థ కరోనా ప్రభావం నుంచి కోలుకోగా.. పెండ్లిండ్ల సీజన్ తోడయ్యింది. ఆగస్టులో గరిష్ఠంగా రూ.56,000 పలికింది. అనంతరం రూ.50వేలకు తగ్గడంతో బంగారం డిమాండ్ పెరిగింది.