For long and thick hair: పొడవాటి, మందమైన జుట్టు మీ సొంతం కావాలంటే….ఇవి ట్రై చేయండి!

జుట్టు రాలిపోతుంటే…..ప్రతిఒక్కరూ ఆందోళనకు గురికావడం సహజం. కానీ జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే….నిర్లక్ష్యం చేయకూడదు. అయితే జుట్టు రాలకుండా…ఒత్తైన జుట్టు కోసం ఏం చేయాలో తెలుసుకుందాం.
జుట్టు సంరక్షణ
నేటి ఆధునిక యుగంలో, కేశాలంకరణకు యువత ఎంత ప్రాదాన్యత ఇస్తున్నారో అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ తమ జుట్టును మందంగా మరియు మృదువుగా ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలు జుట్టు గురించి ఆందోళన చెందుతారు. జుట్టును జాగ్రత్తగా చూసుకోవటానికి తరచుగా హెయిర్‌స్పాలు, హెయిర్ మసాజ్‌లు మరియు అనేక ఇతర పద్దతులను ఎంచుకుంటారు. అయితే కొన్నిసార్లు ఈ చికిత్సలు మీ జుట్టుకు మరింత నష్టం కలిగిస్తాయి. అటువంటి పరిస్థితిలో, చాలా మంది మహిళలు ఇంట్లో తయారు చేసిన రెమెడిస్ ను మాత్రమే పాటిస్తుంటారు.
జుట్టు రాలడం ఒక సాధారణ సమస్య. మళ్లీ కొత్తగా జుట్టు పెరుగుతుంది. ఇదంతా సహజంగా జరిగే ప్రక్రియ. కానీ జుట్టు నెమ్మెదిగా కానీ…అసలే పెరగనప్పుడు మాత్రమే సమస్య తలెత్తుతుంది. మీ జుట్టు సన్నగా, కఠినంగా మరియు దెబ్బతిన్నట్లు కనిపిస్తే, అది మిమ్మల్ని చాలా బాధపెడుతుంది. మీరు కూడా మీ జుట్టు రాలడం వల్ల బాధపడుతూ ఎంతో డబ్బు ఖర్చు చేస్తుంటారు. అయితే మీ జుట్టు పెరుగుదలకు మేము కొన్ని చిట్కాలను మీ ముందుంచుతున్నాం. ఇవ్వన్నీ సహజమైనవి మరియు చాలా తేలికైనవి. ఇప్పుడు జుట్టును మందంగా ఉంచే చిట్కాల గురించి తెలుసుకుందాం.
ఉల్లిపాయ రసం
ఈ మధ్యకాలంలో జుట్టు సంరక్షణ విషయంలో ఉల్లిపాయ రసం విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఇది మీ జుట్టు మరియు చర్మం రెండింటికీ మంచి ఫలితానిస్తుంది. జుట్టు చిట్లే సమస్యను నివారించడంతోపాటు జుట్టు పెరుగడానికి ఉల్లిపాయ సహాయపడుతుంది. అందులో ఉన్న సల్ఫర్ ఎలిమెంట్ వల్ల జుట్టు బలంగా, మెరుస్తూ మందంగా ఉంటుంది. ఉల్లిపాయరసం వేడి చర్మం యొక్క రక్త సరఫరాను పెంచుతుంది, ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
వాడే విధానం
మొదట ఉల్లిపాయను రుబ్బుకుని దాని రసాన్ని తీయండి. ఆ తర్వాత ఈ రసాన్ని వెంట్రకులకు పట్టించి గంటసేపు ఉంచండి. తరువాత షాంపూతో తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండుసార్లు చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఉల్లిపాయ వాసన మీకు ఇబ్బంది కలిగించినట్లయితే రసంలో ఏదైనా నూనె కలిపి ఉపయోగించవచ్చు.
ఆమ్ల
జుట్టు పెరుగుదలకు ఉసిరి ఉత్తమ నివారణలలో ఒకటి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే కొవ్వు ఆమ్లాలు ఉసిరి పుష్కలగా ఉన్నాయి.
వాడే విధానం
మీకు తాజా ఉసిరి అందుబాటులో ఉంటే..వాటిని మెత్తగా రుబ్బుకుని అందులోనుంచి రసాన్ని వేరు చేయండి. ఆ రసాన్ని తలకు పట్టించండి. నెమ్మదిగా మసాజ్ చేయండి. కొద్దిసేపటి తర్వాత మీ జుట్టును షాంపూతో కడగాలి. అయితే వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు జుట్టు ఒత్తుగా పెరిగేందుకు ఉసిరి పౌడర్ లో కొబ్బరి నూనెను కలిపి ఉపయోగించవచ్చు.
మెంతులు
మెంతులు మీ జుట్టుకు మంచి పోషణను అందిస్తాయి. ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంతోపాటు చుండ్రు వంటి సమస్యలను కూడా పరిష్కరిస్తుంది.
వాడే విధానం
కొన్ని చెంచాల మెంతి గింజలను ఒక కప్పు నీటిలో రాత్రిపూట నానబెట్టండి. దీన్ని ఉదయం రుబ్బుకుని పేస్ట్‌గా సిద్ధం చేసుకోవాలి. అప్పుడు ఈ పేస్ట్ ను హెయిర్ మాస్క్ లాగా మీ జుట్టు పట్టించాలి. 30-40 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత మీ జుట్టును గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి ఒకసారి చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది.
గమనిక
ఒత్తిడి కూడా జుట్టు రాలడానికి కారణం కావచ్చు. సరైన ఆహారం తీసుకోవడం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందువల్ల, మీ జుట్టు నిరంతరం ఊడిపోతుంటే, వీలైనంత త్వరగా వైద్యుల సలహా తీసుకోండి.